వేలేరు, జూన్ 19 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం వేలేరు మండలంలోని పలు గ్రామాలలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలట్ గ్రామం శాలపల్లిలో సూమారు 79 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కాగా 36మంది గృహ నిర్మాణాలు చేపట్టారు. అయితే వారిలో ఆరుగురికి మాత్రమే బిల్లులు రావడంతో ఎమ్మెల్యే కడియంకు గ్రామస్తులు బిల్లులు రావడంలేదని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ డీఈ, ఏఈలను పిలిచి బిల్లులు ఎందుకు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తే సహిందేది లేదని హెచ్చరించారు.
సబ్ స్టేషన్ నిర్మాణ పనుల పరిశీలన
మండలంలోని పీచర శివారులో 132/33కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం పరిశీలించారు. పనులు జాప్యంగా జరుగుతుండటంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 132/33కేవి సబ్ స్టేషన్ పనులు పూర్తి చేస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో ప్రారంభించి మరో సూమారు రూ.100కోట్లతో 220/33కేవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆనంతరం పీచర గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు.
కాగా పీచరలో 43ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా గ్రామస్తులు కొంతమంది మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని కోరగా మరో 25 ఇండ్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్ కొమి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, హౌసింగ్ కార్పొరేషన్ డీఈ సిద్దార్థ నాయక్, ఎంపీవో భాస్కర్, నాయకులు బిల్లా యాదగిరి, మల్లికార్జున్, రాజిరెడ్డి, రవీందర్ యాదవ్, లక్ష్మణ్ నాయక్, రాంగోపాల్రెడ్డి, సద్దాంహుస్సేన్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.