శాయంపేట, సెప్టెంబర్ 3 : ఉద్యమ నేత కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ధ్యేయంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరపాలని అసెంబ్లీలో తీర్మానం చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ రైతులు యూరియా దొరక్క తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.
అకాల వర్షాలు, వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి రైతుల కష్టాలను తీరుస్తారని అనుకుంటే సీఎం రేవంత్ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. రైతులకు సంజీవనిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పంటపొలాలకు నీళ్లు ఇచ్చి దేశంలోనే అత్యధిక వడ్లు పండించే రాష్ర్టాల్లో తెలంగాణను మొదటి స్థానంలో మాజీ సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించి రైతులకు యూరియా, కరెంటు కష్టాలు లేకుండా పెట్టుబడి సాయం చేసి రైతు బాధవుడిగా నిలిచిన కేసీఆర్‌పై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేశారని ఆయన విమర్శించారు.
ఏకపక్షంగా ఇచ్చిన చెత్త రిపోర్టును తీసుకుని సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా గండ్ర అభివర్ణించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సీబీఐ, ఈడీ అంటే బీజేపీ జేబు సంస్థ అని అంటాడని, అలాంటి ఆ జేబు సంస్థకే కాళేశ్వరం విచారణ ఇవ్వడం అంటే మోదీ, రేవంత్‌రెడ్డి కలిసి కేసీఆర్ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని గండ్ర డిమాండ్ చేశారు.