నడికూడ, జూలై 19: కాంగ్రెస్ పాలనలో రైతులు కటిక చీకట్లో అరిగోస పడ్డారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరంటుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుదాటి వెంకన్న, రాయపర్తిలో గ్రామ కో ఆర్డినేటర్ పర్నెం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చల్లా హాజరై మాట్లాడుతూ వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నేడు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ భూముల విలువ భారీగా పెరినట్లు వివరించారు. రైతులు ఏటా రెండు పంటలు పండిస్తూ సమాజంలో గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల రైతులు కరంటు కష్టాలు ఎదుర్కొన్నారని, అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారని గుర్తుచేశారు. అయినా వారికి బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు.
వ్యవసాయానికి 3 గంటల కరంటు చాలన్న రేవంత్‌రెడ్డిని చూపి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం చల్లా మండలంలోని నడికూడ, రాయపర్తిలో కే.ఎన్.ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. శిక్షణ పొందే మహిళలకు కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే, రాయపర్తిలో రూ. కోటితో నిర్మించిన మహిళా భవనం, జీపీ కార్యాలయం, సీసీరోడ్లు, అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నడికూడ సర్పంచ్ ఊర రవీందర్రావు, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, ముస్త్యాలపల్లి సర్పంచ్ బొట్ల సంధ్య-రవి, చౌటుపర్తి సర్పంచ్ గూడెం కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, రాయపర్తి సర్పంచ్ రావుల సరితా రాజిరెడ్డి, ఆర్బీఎస్ గ్రామ కో ఆర్డినేటర్ పర్నెం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ అప్పం చేరాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.