గీసుగొండ, అక్టోబర్ 19: సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని నందనాయక్తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గురువారం హనుమకొండలోని చల్లా నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. యువకులు, మేధావులు, రైతులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజా సంక్షేమ కోసం పని చేస్తున్న ప్రభుత్వాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలను ఇస్తున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇక్కడ ప్రకటించిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దని కోరారు.
దేశంలో ఎక్కడా లేని పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉందని ఎమ్మెల్యే చల్లా అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని వివరించారు. అల్లకల్లోలం సృష్టించే కాంగ్రెస్ పార్టీ మనకెందుకని, కులమతాల గురించే మాట్లాడే బీజేపీని పట్టించుకోకుండా ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పని చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆయన కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్తకూ తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జూలూరి లెనిన్గౌడ్, నాయకులు వీరన్న, రవీందర్, వెంకటేశ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో గిరిజన సంఘం గ్రామ అధ్యక్షుడు బదావత్ వెంకన్న, కాంగ్రెస్ గ్రామ నాయకులు భూక్యా శ్రీనివాస్, భూక్యా సుమన్, యూత్ నాయకులు అజ్మీరా వీరన్న, శ్రీనివాస్, బానోత్ సుమన్, బదావత్ బాలరాజు, బానోత్ రాహుల్, తిరుపతి, శ్రీను, విజయ్ తదితరులు ఉన్నారు.