గీసుగొండ, డిసెంబర్ 19 : గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, సర్పంచ్‌లు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం గీసుగొండ మండలంలోని 12 గ్రామాల ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధ్దంగా ఉందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలన్ని అభివృద్ధి సాధించాయన్నారు. పూర్తి కాని పనులను గుర్తించాలని అయన సర్పంచ్‌లను సూచించారు. గత పాలకులు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయన వివరించారు.
నూతనంగా ఏర్పడిన జీపీలకు నూతన భవనాలు మంజూరైనట్లు అయన తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రధానమైన పనులను త్వరగా గుర్తిస్తే వాటికి నిధులు మంజూరు చేసి పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అయన కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరకాల నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుందని గుర్తు చేశారు. పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో పని చేయాలని అయన సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్‌లు అంకతీ నాగేశ్వర్రావు, బోడకుంట్ల ప్రకాశ్, గోనె మల్లారెడ్డి, నాగదేవత, అనిల్, బాబు, అశ్విని, కవిత, జ్యోతి, మండల కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.