వర్ధన్నపేట, అక్టోబర్ 17: తనను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల సహకారంతో తొమ్మిదిన్నరేళ్లలో రూ. 2,700 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అరూరి మంగళవారం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వర్ధన్నపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రజలకు ఇచ్చిన మాట, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నిత్యం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నానని చెప్పారు. మూడోసారి తనకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. మరోసారి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి ప్రతి గడపకూ అందుతున్నట్లు అరూరి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పేదలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను తయారు చేశారన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే విపక్ష పార్టీల అభ్యర్థులను ఏమాత్రం నమ్మొద్దని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలాగా తయారైందని విమర్శించారు. అలాగే, తెలంగాణకు ఏమాత్రం సహకారం అందించని బీజేపీ నాయకులు కూడా ఓట్ల కోసం వస్తున్నారన్నారు. ఇలాంటి నాయకులను ప్రజలు, పార్టీ శ్రేణులు గ్రామాల్లో నిలదీయాలని కోరారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన విపక్ష కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.