హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 : మిస్ వరల్డ్-2025 పోటీలను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మే 6వ తేదీన ప్రపంచంలోని 144 దేశాలకు చెందిన సుందరీమణులు వారి దేశాల తరఫున అందాల పోటీల్లో పాల్గొనడానికి మే 6, 7వ తేదీల్లో తెలంగాణా రాష్ర్టానికి రానున్నారు. అప్పటి నుంచి మే 31 వరకు తెలంగాణలోనే ఈ పోటీలు నిర్వహించి, చివరగా మిస్ వరల్డ్‌ను ఎంపిక చేస్తారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారిని ఐదు బృందాలుగా విభజించి నాగార్జునసాగర్, బుద్ధవనం, వరంగల్ రామప్ప టెంపుల్, యాదగిరిగుట్టతోపాటు వివిధ ప్రదేశాలను ఆయా ఖండాల వారీగా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వారి రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు వరంగల్ పర్యటనలో భాగంగా సందర్శించే కాళోజీ కళాక్షేత్రం వద్ద చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై కలెక్టర్, అధికారులతో చర్చించారు. సుమారు 30 మంది వరంగల్‌ను సందర్శించనుండడంతో ప్రోగ్రాం ఏ విధంగా ఉండాలి?, వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలనే అంశాలపై అన్ని శాఖలతో కో ఆర్డినేట్ చేయాలని కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. మే 14న ఉదయం 11:30 గంటలకు హరిత కాకతీయ హోటల్ చేరుకుంటారని, హోటల్ నుంచి కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి, అకడే విద్యార్థులతో సమావేశమవుతారని, అక్కడి కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి హరిత కాకతీయకు చేరుకుంటారని చెప్పారు.
లంచ్ తర్వాత రామప్ప టెంపుల్లో వెళ్తారని, అక్కడే దాదాపు 2 గంటల ప్రోగ్రాం ఉంటుందన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగరావు, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెంకటాపూర్: పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని శనివారం టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష, కాకతీయ హేరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు, ప్రొఫెసర్ పాండురంగారావు అధికారులతో కలిసి సందర్శించారు. మిస్ వరల్డ్ టీమ్ సందర్శన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కాకతీయుల చరిత్ర, రామప్ప శిల్పకళ, పేరిణి తాండవం, సాంస్కృతిక కార్యక్రమాలు, జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.