హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ): మార్కెటింగ్ శాఖలో త్వరలోనే అవినీతి పాపాల పుట్ట పగిలే అవకాశం ఉన్నది. గత సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులను నిండా ముంచి అడ్డంగా సంపాదించిన వారి మెడపై చర్యల కత్తి వేలాడుతున్నది. త్వరలోనే వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిరుడు పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరుతో, రైతుల పేరుతో వ్యాపారులకు కొమ్ముకాసినట్టు విచారణలో తేలింది. ఈ బాగోతంపై ఇప్పటికే మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ విచారణ చేయించింది. ఇందులో అవకతవకలు నిజమేనని తేలాయి.
మొత్తం 118 మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేయడంతోపాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సైతం విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించగా, ఇప్పటికే సీఐడీ అధికారులు సైతం విచారణ మొదలు పెట్టారని సమాచారం. వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ నివేదిక రాగానే బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
2024-25వ సంవత్సరంలో రాష్ట్రంలో సీసీఐ 21 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. అయితే, తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తూ తక్కువ ధర ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దీంతోపాటు రైతులు తెచ్చిన పత్తిని తేమ ఎక్కువగా ఉన్నదనే సాకుతో వెనక్కి పంపించారని, అదే పత్తిని రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసి తీసుకొస్తే ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేశారని విచారణలో తేలింది. మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు, సీసీఐ అధికారులు ట్రేడర్లతో కుమ్మక్కై దాందా సాగించారని విచారణలో బయటపడింది.
ఈ నేపథ్యంలో సీసీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐకి గతంలోనే లేఖ రాశారు. క్వింటాల్‌కు కనీసం రూ.1,500 చొప్పున కాజేసినట్టు తెలిసింది. ఇలా అంతా కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. ఇందులో మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు ప్రతి క్వింటాల్కూ రూ.20-30 వరకు కమీషన్ రూపంలో ముట్టజెప్పారని తెలిసింది. ఈ కమీషన్ పైసలే సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటాయని తేలింది. అంటే మిగిలిన అధికారుల వాటా కలిపితే ఇది వేల కోట్లలోనే ఉంటుందనే చర్చ మార్కెటింగ్ శాఖలో జరుగుతున్నది.
పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాలపై నిజాలు నిగ్గు తేలేవరకు మార్కెటింగ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లను నిలిపివేశారని తెలిసింది. ముఖ్యంగా అక్రమాలు బయటపడ్డ జోన్లలో ఏ ఒక్క అధికారినిగానీ, ఉద్యోగిని గానీ బదిలీ చేయొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారని సమాచారం. మరోసారి ఇలాంటి అక్రమాలు జరగకుండా, రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని స్పష్టంచేశారని తెలిసింది.
పత్తి కొనుగోలులో మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు అంతా కలిసి కుమ్మక్కై రైతులను నిండా ముంచి వందల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా ఈ అక్రమ దందా జోరుగా సాగించారని తెలిసింది. అక్కడ ఓ కీలక అధికారి ఈ దందాలో చక్రం తిప్పారని సమాచారం.
ఈ ఒక్క అధికారి పరిధిలోనే ఒక్క సీజన్లోనే సుమారు రూ.10 కోట్లకుపైగా అక్రమ దందాకు పాల్పడ్డారని మార్కెటింగ్ శాఖ చేసిన విచారణలో ప్రాథమికంగా బయటపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మార్కెట్ల కార్యదర్శులను బెదిరించి ఆయన ఈ దందాకు పాల్పడినారని, దీంతో సదరు అధికారిని అక్కడినుంచి బదిలీ చేశారని తెలిసింది. అనంతరం ఇందుకు సంబంధించి సీఐడీ విచారణ కొనసాగుతుందని, వారంలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సదరు అధికారి అక్రమాలకు సంబంధించి ఆధారాలు సేకరించి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.