మేడారం : మేడారం గద్దెల వద్ద గతనెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా( Ministers Resign ) చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి (MLC Madhusudhanachari) , ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
హన్మకొండలో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమ్మక్క పూజారి కుమారుడు యువన్ను వారు పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బాలుడికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మంత్రి సీతక్క వచ్చి పరామర్శించి రూ. 10వేలు చేతిలో పెట్టి వెళ్లి ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రులు ఇప్పటివరకు బాలుడిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు.
బాలుడికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి, అతడి భవిష్యత్ కోసం కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లిదండ్రులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వీరివెంట ఎట్టి జగదీష్, మాజీ జడ్పీటీసీ రామాసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్, ఈసం రామ్మూర్తి, మాజీ మదరి రామయ్య, కేయూ బీఆర్ఎస్వీ నాయకులు కొనుకంటి ప్రశాంత్, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.