హనుమకొండ, నవంబర్ 23: ప్రపంచమే చూసేవిధంగా క్రీడాకారులు ప్రతిభను చాటాలని రాష్ర్ట యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న 11వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ 2025-26 పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 23 తేదీల్లో మహిళలు, పురుషుల జూనియర్, సీనియర్ స్థాయి పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ర్టంలోనే 4వ స్పోర్ట్స్ స్కూల్‌ను జిల్లాకు మంజూరు చేసి ఇటీవలే ప్రారంభించుకొన్నామని, క్రీడల్లో ప్రోత్సాహం ఉండాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను ఆషామాషీగా తీసుకోవద్దని, క్రీడలలో లీనమై పోవాలని, మీ ప్రతిభను చూసి ప్రపంచమే మీ దిక్కుకు చూడాలన్నారు. క్రీడల్లో వరంగల్ జిల్లాకు, రాష్ట్రానికి పేరును తీసుకురావాలన్నారు. క్రీడల్లో ఏ క్రీడాకారుడు కూడా వెనకడుగు వేయొద్దన్నారు. క్రీడాకారులుగా ఎదగాలనుకుంటే సమయాన్ని వృధా చేయవద్దని, గ్రామస్థాయి నుంచి దేశానికి ప్రతిభ కలిగిన క్రీడాకారులను అందించేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన ధనుష్‌కు రూ.1.20 కోట్లను రాష్ర్ట ప్రభుత్వం తరఫున ప్రకటించినట్లు తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో పథకాలను సాధించాలని, ధనుష్‌కు ఇచ్చిన విధంగానే స్పోర్ట్స్‌పాలసీ కింద జిల్లాకు చెందిన జీవంజి దీప్తికి ప్రోత్సాహకాలు అందించామని గుర్తుచేశారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ర్ట ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌ను పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఇతర క్రీడా సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కెఆర్ నాగరాజు ప్రతిపాదనలు అందజేస్తే మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.