ములుగు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మల గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు పైసా ఖర్చు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం మంత్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, కలెక్టర్ ఇలా తిప్రాఠి, ఎస్పీ డాక్టర్ శబరీష్, నోడల్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడంతో పాటు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, 40 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించారు.
ఐఅండ్‌పీఆర్ ద్వారా రూపొందించిన పుస్తకాన్ని, మీడియా టీషర్టులను ఆవిష్కరించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ మేడారానికి వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. అధికారులు భక్తులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. జాతర కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా తెలిసేలా మీడియా కవరేజ్ ఇవ్వాలని మంత్రి కోరారు. భక్తుల కోసం రూట్ మ్యాప్‌లతో ఉన్న వీడియోను విడుదల చేసినట్లు తెలిపారు.
భక్తులకు తాగునీటి కొరత లేకుండా చూడాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో నోడల్ అధికారులు కృష్ణ ఆదిత్య, కర్ణన్, ప్రతిమాసింగ్, రాధికాగుప్తా, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీవో అంకిత్, ఏఎస్పీ సంకీర్త్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్ ఏడీ లక్ష్మణ్, డీపీఆర్వో రఫీక్, ఏపీఆర్వో వేణు, ఆర్టీసీ ఆర్ఎం ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ అధికారులకు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంపును శనివారం రాత్రి ఆమె ప్రారంభించారు. బేస్ క్యాంపులో ఏడు కిలో మీటర్ల మేర 50 క్యూలైన్లను నిర్మించామన్నారు. భక్తులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు 6 వేల బస్సులను 25వ తేదీ వరకు నడుపనున్నట్లు తెలిపారు. 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథరావు, ఆర్ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.