ములుగు రూరల్, సెప్టెంబర్ 25 : మేడారం మినీ జాతరను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 చేపట్టే మినీ జాతర పనులు ప్రధాన జాతరకు ఉపయోగపడేలా పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. వందల కోట్లు వెచ్చించి మేడారంలో పనులు చేపడుతున్నా శాశ్వతంగా ఉండకపోవడం వల్ల తిరిగి అవే పనులు మళ్లీ చేపట్టాల్సి వస్తున్నదన్నారు.
ఇప్పటి నుంచి చేపట్టే పనులు దీర్ఘకాలంగా ఉండేలా పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్ఫర్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన దృష్ట్యా జాతరకు నిధులు వచ్చే అవకాశం ఉందని, ఆ నిధులతో గద్దెల చుట్టూ ఫ్లోరింగ్ చేయిచడంతో పాటు నిరంతరం మంచినీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తల్లులను దర్శించుకునే భక్తులకు వసతులు కల్పించే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని తెలిపారు. గత జాతరలో పనిచేసిన అధికారుల సూచనలు పాటిస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు.
2024లో జరిగిన మేడారం మహా జాతర సందర్భంగా చేపట్టిన పనులకు నిలిచిపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పనులు శాశ్వతంగా ఉండేలా అన్ని శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, మేడారం ఈవో రాజేందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.