ములుగు రూరల్, జూలై 21 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె గట్టమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులను, వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్‌హెచ్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ములుగు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారని, మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సీతక్క ఆదేశించారు. అనంతరం ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్‌తో కలిసి అధికారులతో వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.