హనుమకొండ, ఏప్రిల్ 12 : ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పనులు చేయకుండా పెండింగ్ పెట్టిన కాంట్రాక్టర్ల తీరుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఈమేరకు శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. పనిచేసే కాంట్రాక్టర్లకే డబ్బులు ఇస్తామన్నారు. కాంట్రాక్టర్లకు గడువు పెట్టి రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేద్దామన్నారు.
ఎస్సీ డెవలప్మెంట్ కింద ఇచ్చిన సీసీ రోడ్లను అధికారులు పూర్తి చేయాలని బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారం రోజుల్లో టెండర్లు పూర్తిచేసి ప్రారంభించాలని పనులు నాణ్యంగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టంచేశారు. అన్నిచోట్ల రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బాగా పనిచేసిన కాంట్రాక్టర్లకు మిగతా చోట్ల పనులు అప్పగిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తికానిచోట్ల పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తకువ ఉన్న చోట సమీప ప్రభుత్వ పాఠశాల ఆవరణకు తరలించే ఏర్పాట్లు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు సూచించారు.
అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, తదితర సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న సీసీరోడ్డు, ప్రభుత్వ భవనాలు, వంతెనలు తదితర అభివృద్ధి పనులతో పాటు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పెండింగ్ పనుల విషయంలో పలుమార్లు చెప్పినప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు వినడం లేదని మంత్రి ఎదుట అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
సమావేశంలో వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, చీఫ్ విప్ రామచంద్రునాయక్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా ఉమ్మడి జిల్లా సమీక్షకు ఆరు జిల్లాల కలెక్టర్లు హాజరుకావాల్సి ఉండగా హనుమకొండ కలెక్టర్ మినహా ఎవరూ రాలేదు.
సీతక్క వర్సెస్ ఎమ్మెల్యేలు
వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీరాజ్ మంత్రి సీతక్కపై వరంగల్ జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్ని రోజులుగా అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని ఇప్పుడు బహిరంగంగా వ్యక్తం చేశారు. అంతేగాక ఉమ్మడి జిల్లాలోని మరో మంత్రి కొండా సురేఖతో మొదటినుంచీ ఉన్న విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ, మహిళా-శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సీతక్క శనివారం హనుమకొండ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించగా మంత్రి సురేఖ సహా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి హాజరు కాలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీత క్క తన సొంత శాఖపై ఉమ్మడి జిల్లాలోని పనులపై నిర్వహించిన సమావేశానికి అధికార పార్టీకి చెందిన మరో మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి పనులు, నిధుల విడుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వపరంగా కొత్తగా పనులు చేపట్టడంలేదని అధికార పార్టీ మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రామచంద్రూనాయక్, గండ్ర సత్యనారాయణరావు, కె.ఆర్.నాగరాజు అన్నారు. గ్రామాల్లోని రోడ్లుపై కంకర వేసి అలాగే ఉంటున్నాయని, డాంబర్ వేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన శాఖ పనితీరుపై వాస్తవాలు చెప్పడంతో మంత్రి సీతక్క సమీక్షలో ఇబ్బందిపడినట్లు కనిపించారు.
ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు
ఎమ్మెల్యే పల్లా
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలకు నిష్పక్షపాతంగా నిధులు కేటాయించామని, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి సీతక్కకు సూచన చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కల్పించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నాం అనడంతో పల్లా జోక్యం చేసుకొని సమీక్షా సమావేశంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని, బయటకు వస్తే మాట్లాడుతానని సమాధానమిచ్చారు. కాగా ఎంపీ కల్పించుకొని మాట్లాడడంపై పలువురు చర్చించుకున్నారు.