ములుగు, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేయడం కష్టంగా అనిపిస్తే బదిలీ చేసుకొని వెళ్లాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన నిర్వహించిన వరద సంసిద్ధత సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వానకాలంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ముం పు ప్రాంతాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో మంచినీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అలాంటి కాంట్రాక్టర్లను అధికారులు తొలగించాలని ఆదేశించారు. వరదల సమయంలో ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో 24 గంటల కంట్రోమ్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గతేడాది వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదని హెచ్చరించారు. సమీక్షలో ఎస్పీ డాక్టర్ పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీ, ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్ గీతే, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఐబీ ఎస్ఈ విజయ్‌భాస్కర్‌రావు, డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వర్రావు, సివిల్ సైప్లె డీఎం రాంపతి, ఇరిగేషన్ అధికారి అప్పల్నాయుడు, డీఏవో విజయ్‌చంద్ర, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్, డీసీవో సర్దార్‌సింగ్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, పీఆర్ ఈఈ అజయ్‌కుమార్, డీపీఆర్వో రఫీక్, ఏపీఆర్వో వేణు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : ఇంటర్‌ప్రిటేషన్ పనులు అక్టోబర్ లోపు పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం పాలంపేటలో కొనసాగుతున్న ప్రసాద్ స్కీమ్ పనులను, రామప్ప చెరువు కట్టను, తూములను, కాల్వలను, మత్తడి ప్రదేశాన్ని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆలయ తూర్పు రహదారి ఎదురుగా పదెకరాల స్థలంలో రూ. 61.99 కోట్లతో ఫుడ్‌కోర్టు, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత రామప్ప సరస్సును సందర్శించి నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరస్సు మత్తడిని పరిశీలించి వరదల నియంత్రణ కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రామప్ప చెరువు మత్తడి పడిన సమయంలో మోరంచ వాగు, కాలువల్లో సిల్ట్ తీయక పంట పొలాల్లోకి వరద చేరి తీవ్రంగా నష్టపోతున్నామని పాలంపేట రైతులు మంత్రి సీతక్కకు విన్నవించగా సిల్ట్ తీసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులకు సూచించారు.
అలాగే ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు విన్నవించగా త్వరలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, మహేందర్ జీ, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయభాస్కర్, డీఈ రవీందర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పాల్గొన్నారు.