నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలోనూ పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడే కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. వీలైన చోట్ల రక్తదాన శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోనూ అన్నదానం, తదితరాలు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీకి సిద్ధమవుతున్నారు. నల్లగొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో ఘనంగా జన్మదిన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వంపై జనంలో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తమ అభిమాన నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అయ్యేందుకు పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇదే సందర్భంగా కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన హారితహారానికి కొనసాగింపుగా పలుచోట్ల మొక్కలు నాటి వృక్షార్చనలో భాగస్వామ్యం అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు, అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎంగా రాష్ర్టాన్ని పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై కృతజ్ఞత చాటాలన్నారు.