నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఇచ్చిన మాట తప్పారంటూ పలుచోట్ల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. 17వ వార్డు కౌన్సిలర్ అజీముద్దీన్కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని, ఆ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో సోమవారం ఎమ్మెల్యే (మంత్రి) క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్లకు చెందిన పదో వార్డు కౌన్సిలర్ గడ్డమీది ఉషకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల, భీంపూర్, నాగంపల్లి గ్రామాల నుంచి ఆరుగురు కౌన్సిలర్లను గెలిపించేందుకు కాంగ్రెస్ నేత గడ్డమీ ది గోవిందు తీవ్రంగా కృషి చేశారని, ఆయన భార్య ఉషకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పుడు మాటలు విని ఇతరులకు ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒకానొక దశలో కాంగ్రెస్‌కు చెందిన మహిళలు జెడ్పీటీసీ ఇంటి ముందు ఉన్న కార్లపై దుమ్మెత్తి పోయడంతో డీఎస్పీ లింగయ్యతోపాటు పోలీసులు వారిని వారించే ప్రయత్నంచేశారు. వినకపోవడంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకు దిగిన సమయంలో సీఎం సోదరుడు, కొడంగల్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి మాజీ జెడ్పీటీసీ ఇంట్లోనే ఉన్నట్టు వారు తెలిపారు.
అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి బాండ్ పేపర్ రాసిచ్చి మోసానికి ఒడిగట్టింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ అక్కమ్మకు వైస్ చైర్మన్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన గంటల వ్యవధిలో మోసానికి పాల్పడింది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కుడుముల రజితను ఎన్నుకున్నారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఎం హన్మంతు పేరును ప్రతిపాదించి ఎన్నుకున్నారు. తనను వైస్ చైర్పర్సన్ చేస్తానని బాండు పేపర్ రాసిచ్చి మరొకరికి పదవి కట్టబెట్టడం ఏమిటని ఆశ్చర్యపోయిన అక్కమ్మ, ఆమె కుటుంబసభ్యులు పరిగిలోని పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కాంగ్రెస్ నుంచి చైర్పర్సన్, వైస్చైపర్సన్లను ఎన్నుకున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న దివంగత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి ఇంటి నుంచి ఆయన కోడలు కౌన్సిలర్‌గా గెలుపొందగా, పార్టీ నాయకులు, ప్రజలు చైర్మన్ పీఠం నల్లెల్ల ఇంటినే వరిస్తుందని ఆశించారు. మంత్రి సీతక్క సైతం నల్లెల్ల కుటుంబానికే కట్టబెడుతుందని అనుకున్నారు. కానీ, ప్రమాణస్వీకారంలో అలా జరగలేదు. దీంతో నల్లెల్ల కుమారస్వామి కోడలు నల్లెల్ల స్వాతి-భరత్ ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం కంటతడి పెట్టారు. తన మామ నల్లెల్ల కుమారస్వామి చిత్రపటంపై పడి విలపించింది.