మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మహాజాతరపై అధికారులతో మేడారంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏవైనా సమస్యలుంటే అధికారులు తమ దృష్టికి తేవాలని చెప్పారు. పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులను పరుగెత్తించి మరీ జాతర పనులను పూర్తి చేయిస్తామన్నారు. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
మేడారంలో అమ్మవార్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వారికి పూజారులు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ అంబరీశ్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ ఘనంగా స్వాగతం పలికారు. డోలివాయిద్యాలతో గద్దెల వద్దకు తీసుకెళ్లగా వారు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు మంత్రులకు అమ్మవార్ల వస్ర్తాలతో పాటు ప్రసాదం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేయగా టెండర్లు నిర్వహించి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరిన్ని నిధులు కావాలని ప్రభుత్వాన్ని కోరగా రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో శాశ్వత పనులు చేపడుతామని, నాణ్యతపై రాజీపడేది లేదన్నారు. 90శాతం మేర పనులు నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50 కోట్లతో పూజారుల భవనానికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు.
ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు చేసి జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు. జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహ నిర్మాణం చేపడుతోందని, వచ్చే జాతర నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి సురేఖ వివరించారు. వరదల కారణంగా మేడారం ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని, మేడారం జాతర నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తు న్నామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించేలా అధికారులు పర్యవేక్షించాల న్నారు. వారికి వంతపాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే జాతరలో మరిన్ని నిధులు కేటాయించి మేడారాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఇందుకు కృషిచేయాలని కోరారు. జాతరకు వచ్చే మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, డీఎఫ్వో రాహుల్కిషన్జాదవ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.20లక్షలతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన శానిటేషన్ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న పూజారుల అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు.