నమస్తే తెలంగాణ నెట్వర్క్ ;మహిళల అభ్యున్నతి, వికాసం కోసం విశేష కృషిచేస్తున్న కేసీఆర్ సర్కారు వారి ఆర్యోగం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇటీవల మహిళా దినోత్సవ కానుకగా ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఆడబిడ్డలకు అభయమిస్తున్నది. ఇందుకోసం జిల్లా ప్రభుత్వ దవాఖానలు, సబ్ సెంటర్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయడంతో పాటు ప్రతి మంగళవారం ఎనిమిది రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల సేవలు అందుబాటులోకి రావడంతో ఆయాసెంటర్లు కిటకిటలాడుతున్నాయి. మంగళవారం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ‘ఆరోగ్యమహిళ’ విభాగాన్ని కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రారంభించారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగున్నట్లేనని.. ఆడబిడ్డలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే హనుమకొండ జిల్లాలో ఐదు కేంద్రాలను ప్రారంభించి 300మందికి పరీక్షలు చేయగా నిర్వహణ తీరును కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎంహెచ్‌వో సాంబశివరావు పరిశీలించి సేవలపై ఆరా తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని పీహెచ్సీ వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళలతో సందడిగా కనిపించింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో 55మందికి పరీక్షలు చేసి బీపీ, షుగర్, తదితర సమస్యలున్న వారిని గుర్తించి ఉన్నత శ్రేణి దవాఖానలకు సిఫారసు చేశారు. ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి, ఎనిమిది రకాల వైద్య పరీక్షలు చేస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ఆడబిడ్డలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు
వరంగల్ : ఇప్పడు వైద్యం అంటే ఖరీదైన విషయం. ఈ సమయంలో పేదింటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేయించడం సంతోషంగా ఉంది. ఇదివరకు పరీక్షలన్నీ ప్రైవేట్ దవాఖాన్లకే రాసేవారు. ఇప్పుడు సర్కారోళ్లే అన్ని పరీక్షలు ఫ్రీగా చేయిస్తున్నారు. మా కోసం ప్రత్యేకంగా మహిళా క్లినిక్‌లు ఏర్పాటుచేయడం బాగుంది. ప్రతి మంగళవారం వైద్య సేవలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు. ఆరోగ్య మహిళా క్లినిక్‌లపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి.
– రమాదేవి, నయీంనగర్
అన్ని పరీక్షలు ఫ్రీ..
వరంగల్ : ఆరోగ్యమహిళ క్లినిక్‌లో ఎనిమిది రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు. దీని వల్ల వేలాది రూపాయలు ఆదా అవుతాయి. డబ్బులు లేక ఎంతోమంది పేదలు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం సంతోషంగా ఉంది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత సర్కారు వైద్యం పేదలకు దగ్గరైంది. ఇదివరకు సర్కారు దవాఖానకు పోవాలంటే భయమయ్యేది. ఇప్పుడు నమ్మకంతో ధైర్యంగా పోతున్నం.
– వసంత, పోచమ్మకుంట
మహిళలకు వరం..
దంతాలపల్లి, మార్చి 14 : రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి మంగళవారం పరీక్షలు చేయడం చాలా బాగుంది. ఇలా మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం రాష్ట్రం మహిళలకు వరం లాంటిది. మహిళలు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి లక్షలు ఖర్చు చేసినా తగ్గవు. పేదవారి పరిస్థితిని అర్థం చేసుకొని వారు ప్రైవేటుకు వెళ్లే బాధలను తప్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. వారంలో ఒక రోజు కేటాయించి 8 రకాల పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నారు.
– చిలకమారి రామతార, దంతాలపల్లి