వరంగల్, నవంబర్ 3 : చారిత్రక వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ నగరంలోని భద్రకాళీ బండ్ సుందరీకణ, మాడవీధుల అభివృద్ధి, బొందివాగు వరద నివారణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో మూడు దశాబ్దాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.
వరద నివారణకు రూ.158 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భద్రకాళీ చెరువులో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, వెంటనే పూడికతీత పనులకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళీ చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. త్వరలోనే కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, కుడా పీవో అజిత్‌రెడ్డి, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు బీమ్‌రావు, సంతోష్‌బాబు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.