వరంగల్, ఆగస్టు 24 : వరంగల్‌ను మహా నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ప్లాన్‌ను తక్షణమే సిద్ధం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, పలు శాఖల అధికారులతో వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
2041 మాస్టర్ ప్లాన్‌ను 2050 నాటికి పెరుగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఇందుకు కావాల్సిన భూసేకరణ చేపట్టాలన్నారు. కన్సల్టెంట్లు తయారు చేసిన వరంగల్ మాస్టర్‌ప్లాన్‌ను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించి పలు సూచనలు చేశారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, సీడీఎంఏ వీపీ గౌతమ్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, కుడా చైర్మ న్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, పీవో అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.