వరంగల్, జూన్ 11(నమస్తేతెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 17న వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనపై ఆదివారం ఎమ్మెల్యే ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. 17న మంత్రి కేటీఆర్ గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సౌత్‌కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఆ తర్వాత నర్సంపేటరోడ్డులోని ఓసిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం వరంగల్ దేశాయిపేటలో రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన, అదే ప్రాంతం లో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారన్నారు. తర్వాత పోచమ్మమైదాన్‌లోని రత్నహోటల్కు ఎదురుగా ఉన్న ప్ర భుత్వ స్థలంలో హరిత హోటల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం మండిబజార్‌లో ఒకేచోట రూ. 5.66 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఈద్గాలు, ఒక దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మండిబజార్ నుంచి వరంగల్చౌరస్తాకు చేరుకుని స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన 16 రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు.
రూ. 280 కోట్లతో ఇన్నర్ రింగ్‌రోడ్డు
అనంతరం రంగశాయిపేటలో రూ. 280 కోట్ల అంచనా వ్యయంతో ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే నన్నపునేని వివరించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు ఇప్పటి వరకు రూ. 220 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇదే రంగశాయిపేటలో రూ. 5 కోట్ల అంచనా వ్యయం తో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఉర్సులోని రంగలీలా మైదానం వద్ద స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన ఎస్టీపీని ప్రారంభిస్తారని చెప్పా రు. అక్కడే రూ. 14.50 కోట్లతో చేపట్టనున్న ఉర్సుబండ్ అభివృద్ధి పనులు, రూ. 5 కోట్లతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మాదిరిగా నిర్మించనున్న కల్చరల్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని నరేందర్ వివరించారు. తర్వాత రూ. 83.50 లక్షల అంచనా వ్యయంతో ఉర్సు దర్గాలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం వరంగల్‌లో రూ. 74.50 కోట్లతో నిర్మించనున్న మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తర్వాత ఖిలావరంగల్‌లో మ్యూజి యం నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తయిన లైటింగ్‌ను ప్రారంభిస్తారన్నారు. తర్వాత ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్లో రూ. 80 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక్కడే 50 వేల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.