మహబూబాబాద్, జూన్ 28 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 30న పోడు భూముల హక్కు పత్రాలు(పట్టాలు) అందించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. బుధవారం ఐడీవోసీలోని స్టేట్ చాంబర్లో మంత్రి పర్యటన, పోడు పట్టాల పంపిణీపై జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన పైలాన్, అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్, పూల ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఆవిష్కరించనున్నారని తెలిపారు.
ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తారని వివరించారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో 15వేల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ మాట్లాడతారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, జిల్లా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.