‘ఈ రోజు తెలంగాణ గడ్డమీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు, మహానుభావుడు కేసీఆర్’
వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్, ఏప్రిల్ 20: గ్రేటర్ వరంగల్, నర్సంపేటలో మంత్రి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. రూ.188 కోట్లతో పలు అభివృద్ధి పనులకు చకచకా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉదయం 10.27కు జీడబ్ల్యూఎంసీ కార్యాలయానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మేయర్ గుండు సుధారాణి పూల మొక్కఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేషన్ అవరణలో ఒకే చోట ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
కార్యకర్తను సముదాయించి..
కేటీఆర్ పర్యటనలో రోప్ పార్టీ పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తకు మధ్య వాగ్వాదం జరిగింది. బల్దియాకు మంత్రి కేటీఆర్ చేరుకున్న సమయంలో కార్యకర్తలను రోప్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 29వ డివిజన్‌కు చెందిన తాటికొండ రమేశ్ పోలీసులతో వాదిస్తుండగా గమనించిన మంత్రి కేటీఆర్ అతడిని వారించి దగ్గరికి తీసుకుని ఫొటో దిగారు.
నర్సంపేటలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షలతో నిర్మించిన మెప్మా భవనాన్ని, రూ.30 లక్షలో కట్టిన కొత్త గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. రూ.37కోట్లతో మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనులకు, రూ.4.5 కోట్లతో సమీకృత మార్కెట్ భవనానికి, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ ఆవరణలో మొక్క నాటారు. మెప్మా మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
పీఎన్జీని ప్రారంభించి.. సామాన్యుడి ఇంట్లో స్టౌ వెలిగించి..
దేశంలోనే తొలిసారిగా నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులో మెగా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటింటికీ పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, స్టోరేజీ సెంటర్ల నుంచి గ్యాస్‌ను వదిలారు. సర్వాపురం పాకాల రోడ్డులో 4వ వార్డుకు చెందిన రాపోలు కొండయ్య పీఎన్జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడి ఇంటికి మంత్రి వెళ్లి గ్యాస్‌ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇంట్లో స్టౌను కూడా వెలిగించి కంపెనీ ఏర్పాటు చేసిన గ్యాస్ మీటర్‌ను పరిశీలించారు. ఇక్కడే గౌడన్నలు మంత్రి కేటీఆర్‌కు తాటి ముంజలు అందించారు.
14 పనులకు శంకుస్థాపన
రూ.8కోట్లతో 150 కేఎల్డీ సామర్థ్యం కలిగిన మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ ప్లాంట్, రూ.22.50 కోట్లతో కార్పొరేషన్ పరిపాలనా భవనం, రూ.2 కోట్లతో కొత్త కౌన్సిల్ హాల్, రూ.2కోట్లతో దివ్యాంగుల శిక్షణ కేంద్రం, రూ.9కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల కల్పన, రూ.1.50 కోట్లతో పోతన వైకుంఠ ధామం నిర్మాణం, రూ.22కోట్లతో నయీంనగర్ నుంచి ప్రెసిడెన్షియల్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్, రూ.15కోట్లతో నాలాలపై కల్వర్టు నిర్మాణం, రూ.71కోట్లతో బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, రూ. 2.50కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్, రూ.70లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో 150 అడుగుల ఎత్తు జాతీయ జెండా ఏర్పాటు, రూ.4కోట్లతో కార్పొరేషన్ అవరణలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.3.10కోట్లతో హస్తకళల విక్రయశాల భవనం, రూ.3.60కోట్లతో మచిలీబజార్ ప్రభుత్వ పాఠశాల అవరణలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు ఒకేచోట శంకుస్థాపన చేశారు.
రుణాలిచ్చి.. ఉత్సాహ పరిచి..
పైప్డ్ గ్యాస్ ప్రారంభం అనంతరం నేరుగా ద్వారకాపేట శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన పలువురు మహిళలకు బహుమతులు అందజేశారు. ఇక్కడే బ్యాంక్ లింకేజీ కింద1,281 మహిళా సంఘాలకు రూ.72.56కోట్ల రుణాలు, స్త్రీ నిధి ద్వారా 205 మహిళా సంఘాలకు రూ.20.15కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. గతంలో అభయహస్తం కోసం డబ్బు చెల్లించిన 39,278 మంది మహిళలకు రూ.12.29కోట్ల చెక్కులు మంత్రి అందించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 146 గ్రామాల్లో మహిళా భవనాల (వీవో) నిర్మాణాలకు స్థలాల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోలార్ ల్యాంప్‌లను అందించారు.
ప్రారంభోత్సవాలు
స్మార్ట్‌రోడ్డు -4 : కార్పొరేషన్ నుంచి భద్రకాళీ జంక్షన్ వరకు రూ.7కోట్లతో నిర్మించిన స్మార్ట్‌రోడ్డు-4ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.27లక్షలతో కొనుగోలు చేసిన రెండు స్వర్గరథాలను, రూ.36లక్షలతో కొన్న 66 ఫాగింగ్ మిషన్లను ఆవిష్కరించారు.