రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రాముడి సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం ప్రగతి పొద్దు పొడిచింది. వరంగల్వాసుల కలలను సాకారం చేస్తూ మొత్తంగా రూ.618 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన సందర్భం జాతరను తలపించింది. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, ఎంపీ, ఎమ్మెల్సీలతో కలిసి దేశాయిపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, నగరంలో స్మార్ట్ సిటీ రోడ్లు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ పరిశ్రమ, వరంగల్ కలెక్టరేట్, మోడల్ బస్‌స్టేషన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 17
వరంగల్/ వరంగల్ చౌరస్తా/ కరీమాబాద్/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ/గీర్మాజీపేట, జూన్ 17 : వరంగల్ నగరంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఉదయం నుంచి సాయత్రం వరకు అలుపులేకుండా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..
వరంగల్ దేశాయిపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను చూసి ప్రశంసించారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు శంకుస్థాపన
దేశాయిపేటలో తెలంగాణ రాష్ట్ర మహిళ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.4కోట్లతో నిర్మించే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
స్మార్ట్‌రోడ్లు ప్రారంభం
గిర్మాజీపేట, జూన్ 17: 25వ డివిజన్ మైనారిటీ డెవెలప్మెంట్ పనులు, రూ. 135 కోట్లతో నిర్మించిన స్మార్ట్రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ, నేతన్నల విగ్రహాల ఆవిష్కరణ
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా ఉంటూ చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, నేతన్న విగ్రహాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మహానుభావుడని, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన కేసీఆర్‌కు ఆశ్రయం కల్పించి, తన ఇంటినే పార్టీకి అంకితం చేశారని గుర్తుచేశారు. వరంగల్ కొత్తవాడలో కార్మికుల ఉపాధి కోసం మేయర్, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఇక్కడ తయారు చేసిన దర్రీస్, బెడ్‌షీట్స్‌కు ఇతర దేశాల్లో సైతం డిమాండ్ పెరగడం నేతన్నల పనితనానికి నిదర్శమని ప్రశంసించారు.
సమీకృత కలెక్టరేట్‌కు శంకుస్థాపన
రూ.80కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో ఆజంజాహి మిల్స్ స్థలంలో నిర్మించే వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ 18 ఎకరాల స్థలంలో కలెక్టరేట్‌ను, జిల్లా ఉన్నతాధికారుల వసతి భవనాలను నిర్మించుకుంటున్నామని వివరించారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులకు శంకుస్థాపన
ఆర్టీఏ జంక్షన్లో ఇన్నర్‌రింగ్ రోడ్డు పనులకు మంత్రి రామన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఉర్సు చెరువులో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఉర్సు గుట్ట వద్ద పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. ఉర్సు దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దశాబ్ది ఉత్సవాల పైలాన్
గ్రేటర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పైలాన్‌ను మంత్రి కేటీఆర్ అవిష్కరించారు. రూ.17లక్షలతో ఏర్పాటు చేసిన ఈ పైలాన్ రాష్ట్రంలోనే మొదటిది.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం
గ్రేటర్ వరంగల్‌లోని 19వ డివిజన్ ఓ సిటీలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంప్ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సతీమని వాణి మంగళహారతితో స్వాగతం పలకగా అర్చకులు వేద మంత్రాలతో స్వాగతించారు. ఎమ్మెల్యే నరేందర్‌ను మంత్రి కేటీఆర్ స్వయంగా కుర్చీలో కుర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సెల్ఫీల జోరు
మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులు, ఆర్పీలు మంత్రితో ఫొటోలు దిగేందు కు ఉత్సాహం చూపారు. కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, తెలంగాణ హస్తకళా బోర్డు చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, ఈఈ భాస్కర్, డిపో-2 డీఎం సురేశ్, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, మారుతీ సాగర్, డాక్టర్ హరి రమాదేవి, కార్పొరేటర్లు కావటి కవిత, బస్వరాజు శిరీష, గందె కల్పన, గుండేటి నరేంద్రకుమార్, గుండు చందన పూర్ణచందర్, బస్వరాజు కుమార్, మాజీ కార్పొరేటర్లు యెలగం లీలావతి సత్యనారాయణ, యెలుగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు బస్వరాజు శ్రీమాన్, గందె నవీన్, సాంబారి సమ్మారావు, తెలంగాణ పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, గుండు విజయ్‌రాజ్, ఆడెపు రవీందర్, గోరంటల రాజు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ బస్టాండ్‌కు శంకుస్థాపన
తెలంగాణలో రెండో అతి పెద్ద నగరంగా గుర్తింపు కలిగిన వరంగల్‌లో రూ.75కోట్లతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా), తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) సంయుక్తంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఐదు అంతస్థులతో కమర్షియల్ కాంప్లెక్స్‌తో పాటు 35 బస్ ప్లాట్‌ఫాంలతో దీనిని నిర్మించనున్నారు. నమూనాను పరిశీలించిన మంత్రి, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రానున్న 50ఏళ్ల అవసరాలకు తగిన విధంగా ఉండాలని సూచించారు. 18నెలల్లో పనులు పూర్తి అవుతాయని చెప్పారు.