యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని షాక్‌కు గురిచేశాయి. ఉమ్మడి జిల్లాలో కీలకమైన హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తమ అనుచరులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా వారు ఓడిపోవడంతో ఖంగుతిన్నారు. వరంగల్‌లో కొండా సురేఖ అనుచరుడు బత్తిని నిఖిల్‌ను కాదని సాధారణ కార్యకర్త పరమేశ్వర్‌కు విజయం కట్టబెట్టడం, హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని అనుచరుడు సతీశ్‌కు బదులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుమారుడు దిలీప్ గెలవడం జీర్ణించుకోలేకపోతున్నారు. అనూహ్య పరిణామాలతో నైరాశ్యంలో పడిపోయిన ఆ ఇద్దరు.. అధికారంలో ఉండి కూడా ఇలా ఓడిపోవడం ఏమిటని మదనపడుతున్నారు. అంతేగాక మొదటినుంచీ నాగరాజు కుమారుడు బరిలో ఉండడంపై గుర్రుగా ఉంటూ వచ్చిన నాయినికి తాజా ఫలితం మింగుడుపడకపోగా ఇద్దరి మధ్య దూరం పెంచినట్లయింది.
– వరంగల్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ కీలక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తెచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి అనుచరులపై ఆ పార్టీలోని సాధారణ కార్యకర్తలు విజయం సాధించడంతో ముఖ్య నాయకులకు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసిన మంత్రి కొండా సురేఖ అనుచరుడు బత్తిని అఖిల్‌పై మూడు వేల ఓట్ల ఆధిక్యంతో పరమేశ్వర్ గెలిచారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు సతీశ్ హనుమకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేశాడు. ఈ ఎన్నికలో సతీశ్‌పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుమారుడు కేఆర్ దిలీప్ 4వేల ఓట్ల తేడాతో గెలిచారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తమ అనుచరుల గెలుపు కోసం బాగా కష్టపడ్డారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. తమ అనుచరులను గెలిపించాలని, పార్టీలో అందరికీ అవకాశాలు వచ్చేలా చూస్తామని చాలామందికి హామీలు ఇచ్చారు.
ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో మంత్రి కొండా సురేఖ అనుచరుడు బత్తిని అఖిల్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు సతీశ్ ఓడిపోయారు. సొంత జిల్లాల్లో తమ అనుచరులను పోటీలో దింపి, స్వయంగా ప్రచారం చేసినా ప్రతికూల ఫలితాలు రావడంపై ఇద్దరు ముఖ్యనేతలు తట్టుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అధికార పార్టీలో తమకు వ్యతిరేక ఫలితాలు రావడం ఏమిటని ఆలోచిస్తున్నారు. తక్కువ సమయంలోనే పార్టీ పరంగా ఇద్దరు ముఖ్యనేతలపై అసంతృప్తి ఉందని యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సం స్థాగత ఎన్నికల ప్రక్రియలో భా గంగా ఇటీవల అన్ని జిల్లాల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించింది. యూత్ కాంగ్రెస్‌లో జిల్లా, ని యోజకవర్గ అధ్యక్ష పదవులకు ఆన్లైన్ ఓటింగ్ విధానంలో ఈ ఎన్నికలు జరిగాయి. రెండు నెలలుగా సభ్యత్వ నమోదు, పోలింగ్ ప్రక్రియ జరుగుతూ వచ్చిం ది. రెండు రోజుల క్రితం ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
వరంగల్, హనుమకొండ జిల్లాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికలో ఆ పార్టీలోని కీలక నేతలకు షాక్ ఇచ్చాయి. దేవాదాయ మంత్రి కొండా సురేఖ, హనుమకొం డ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరులు ఈ ఎన్నికలో ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని రెండు కీలక జిల్లాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధులకు ఈ ఫలితాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయిని రాజేందర్‌రెడ్డికి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు మధ్య యూత్ కాంగ్రెస్ ఎన్నికలతో విభేదాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన కేఆర్ నాగరాజు కుమారుడు హనుమకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయడంపై నాయిని రాజేందర్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాజేందర్‌రెడ్డికి, కేఆర్ నాగరాజుకు మధ్య దూరం మరింత పెరిగింది. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మద్దతు ఇచ్చిన వారే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా గెలిచారు.