వరంగల్ చౌరస్తా: వరంగల్ స్టేషన్ రోడ్డు కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (కృష్ణ కాలేజ్) నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు ఏడు దశాబ్దాల క్రితం బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మహిళా కళాశాలగా మంచి గుర్తింపు ఉందని అన్నారు.
నాటి కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబలిటి స్కీమ్ ద్వారా ముందుకు వచ్చిందని అన్నారు. రూ.5 కోట్లతో రెండున్నర అంతస్తుల్లో 15 తరగతి గదులను నిర్మించనున్న తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి, జిల్లా అధికారులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.