జనగామ, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వచ్చాడు.. అక్కడ ఏ ఇబ్బందీ లేదు.. ఒక్క జనగామ నియోజకవర్గంలో మాత్రమే మాకు సమస్య ఉంది.. అన్న(ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి) మా పార్టీలోకి రాడు.. ఎందుకంటే ఆయన నిఖార్సైన బీఆర్ఎస్ నాయకుడు.. నేను కూడా ఆ పార్టీలో పనిచేసినప్పుడు వ్యక్తిత్వం అంటే ఏంటో బాగా తెలుసు.. అజాత శత్రువు.. నెమ్మదస్తుడు.. కొట్లాడే వ్యక్తి కాదు.. ఆయన కొట్లాట పెట్టుకునేటోడైతే నేను కూడా కొట్లాట పెట్టుకుందామని చూస్తా.. కానీ రాజేశ్వర్రెడ్డిలో కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఉంది కాబట్టి మేం కూడా కలిసిపోయి కార్యక్రమాలు చేయాలని నిర్ణయానికి వచ్చాం’ అని రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మొదట్లో జనగామ పర్యటనకు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేది.. ఎందుకంటే మా పార్టీ అభ్యర్థి ఓడిపోవడం, రాజేశ్వర్‌రెడ్డి గెలవడం వల్ల గతంలో ఇన్చార్జిలు కార్యక్రమాలను నడిపించారు. ఇప్పుడు వాళ్లే నడిపిస్తారని మా నాయకుడు చెప్పాడు’ అని అన్నారు. అయితే ప్రజల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో స్థానిక ఎమ్మెల్యేను ఇబ్బందులు పెట్టుకుంటూ..
మనం ఇబ్బందులు పడితే బాగుండదని అభివృద్ధి పనుల విషయంలో పార్టీ ఇన్చార్జి అభిప్రాయాలు తీసుకుంటాం కానీ అధికారిక కార్యక్రమాలను సాఫీగా నడిపిద్దామని.. పార్టీ ఇన్చార్జిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని సముదాయించామని మంత్రి సురేఖ చెప్పారు. ఇక నుంచి అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కలెక్టర్‌కు చెప్పామని, పార్టీలపరంగా వెళ్తే అధికారులు ఇబ్బందులు పడొద్దని ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక ముందు అభివృద్ధి, సంక్షేమం విషయంలో దయచేసి మీరు(పల్లా) కూడా అందరినీ కలుపుకొని పోవాలి అని మంత్రి విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులను ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకుండా వచ్చిన వెంటనే లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా తొందరగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బ్యాంకుల్లో వేసుకొని పిల్లలు, కుటుంబం కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఆలయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని.. ప్రాధాన్యతాక్రమంలో రాజకీయాలకు తావులేకుండా ప్రతి నియోజకవర్గంలో రెండు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి సురేఖ సూచించారు. నియోజకవర్గంలోని బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన మొత్తం 225 మంది లబ్ధిదారులకు చెకులను మంత్రి, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, స్థానిక వార్డు కౌన్సిలర్ పేర్ని స్వరూప, జనగామ ఆర్డీవో గోపీరాం తదితరులు పాల్గొన్నారు.