సంగెం, నవంబర్ 7 : ఓరుగల్లు వాసుల గగనయానం కల త్వరలో నెరవేరనున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అన్నారు. 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం గురువారం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, పరకాల, వర్ధన్నపేట, పశ్చిమ ఎమ్మె ల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి పరిశీలించారు. అనంతరం గుంటూరుపల్లి గ్రామంలో గాడిపల్లి, నక్కలపల్లి రైతులతో మాట్లాడారు.
అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా మామునూరును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ప్రణాళికల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్‌పోర్టు సర్వీ సులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతిలో దూసుకపోతుందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు అప్పగించేందుకు అంగీకరించిన రైతులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వారికి మార్కెట్ విలువ ప్రకారం పరి హారం చెల్లిస్తామని తెలిపారు. భూమిని కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు ఇతర భూమి కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ విమానాశ్రయం ఏర్పాటుతో వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన, అరుణ, చింతాకుల అనిల్, సురేష్జోషితో పాటు ఆర్అండ్బీ ఎస్సీ నాగేంద ర్రావు, ఈఈ జితేందర్‌రెడ్డి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.