వరంగల్, జూన్ 12 : నగరం భవిష్యత్‌లో ముంపునకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన దీర్ఘకాలిక ప్రణాళికలు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సమావేశ మందిరంలో మేయర్ గుండు సుధారాణి, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్, అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, సంధ్యారాణితో కలిసి మంత్రి వరద ముంపు నివారణ, గ్రేటర్‌లోని 66 డివిజన్ల అభివృద్ధి, మొక్కల పెంపకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో నగరం ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వరద నీరు నిలువకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా పనులు చేయాలన్నారు. బయటి నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా ఉన్నతాధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. నగరాభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకురావడానికి కృషి చేస్తామన్నా రు. గ్రేటర్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్
నగరం వరద ముంపునకు గురికాకుండా ఎలాంటి ముంద స్తు చర్యలు తీసుకోవాలనే విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రి సురేఖకు వివరించారు. 2022-23 సంవత్సరంలో వరద ముంపును ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను వివరించారు. నగరంలో ఇప్పటికీ నా లాల పూడికతీత, నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. వడ్డేపల్లి నాలా నుంచి సమ్మయ్యనగర్, నయీంనగర్ మంగలివా గు, యూటీ (ఎస్సారెస్పీ) కెనాల్ ప్రాంతాలు వరద ముంపున కు గురికాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
భద్రకాళీ నాలా, భట్టుపల్లి, సాకరాశికుంట నుంచి, 12 మోరీ లు ద్వారా భద్రకాళీ చెరువు, జీడబ్ల్యూఎంసీ నుంచి మ్యూజికల్ గార్డెన్, కాకతీయ కాలనీ మీదుగా నాగారం చెరువు వరకు వరద నీరు వెళ్తుందని వివరించారు. ఇరిగేషన్ ద్వారా రూ.158 కోట్ల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మ రికొన్ని ప్రతిపాదనల అవసరం ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పోతనరోడ్ నుంచి అలంకార్ మీదుగా ఎస్సారెస్పీ వరకు వరద కాలువ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
రూ. 200 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వడ్డేపల్లి చెరువు నుంచి ఊరచెరువు వరకు రూ. 60 కోట్ల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని జంక్షన్లను విస్తరించాలన్నారు. లక్ష వృక్షార్చన కార్యక్రమం చేపట్టి విరివిగా మొక్కలు నాటాలన్నారు. గ్రేటర్లో 217 కిలోమీటర్ల మేర స్ట్రెచ్ మొక్కలు నాటేందుకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ విలీన గ్రామాలు గరీబ్‌నగర్, కీర్తినగర్‌లో తాగునీటి పైన్‌లైన్ల కోసం తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ విలీన పారిశుధ్య కార్మికుల కొరత ఉందన్నారు. వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అటవీ శాఖ అధికారి కృష్ణ, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, వైద్య, ఆరోగ్య శాఖ, విపత్తుల నివారణ, రోడ్డు, భవనాల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.