త్యాగాల పునాదులపై తెలంగాణ తలెత్తుకొని సగర్వంగా నిలబడిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని అమరుల కుటుంబాలను సన్మానించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఊపిరిలూదిన ఉద్యమానికి సకల జనులు తోడై పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అమరుల కుటుంబాలకు సర్కారు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల్లో వీరికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రికి రెండు కళ్లని చెప్పారు. తొమ్మిదేళ్లలోనే అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడుస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. గాంధేయ మార్గంలో రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అమరులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
హనుమకొండ, జూన్ 22 : ఎంతో మంది త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరోజు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాలోని అమరుల కుటుంబాల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరుకాగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తర్వాత పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల చివరి రోజు అమరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వీరులను మరిచిపోలేమన్నారు. ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తే బాధ అనిపిస్తుందన్నారు.
తాము నష్టపోయినప్పటికీ భవిష్యత్తరాలు బాగుపడాలని వీర మరణం పొందారనారు. వారికి మనం ఏం చేసినా తక్కువేనన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆనాటి ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాలకు అండగా నిలచి, ఇంటికో ఉద్యోగం, రూ.10లక్షల ఆర్థికసాయం చేశారన్నారు. తెలంగాణ అమరవీరుల పథకం కింద 450 కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారన్నారు. అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్‌లో ఒక మహాసృ్మతి కేంద్రాన్ని, సృ్మతివనం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుస్సేన్ సాగర్ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో అపూర్వమైన రీతిలో జ్వలించే మహా దీపకళిక రూపంలో అమరవీరుల స్తూపం, సృ్మతికేంద్రం నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడ మ్యూజియం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో సాగు, తాగు నీరు, రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడి ధర్నాలు చేసేవారన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరిస్థితులు అన్ని మారిపోయాయన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అభివృద్ధ్ది, సంక్షే మం సీఎం కేసీఆర్‌కు రెండు కళ్లలాంటివన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ పోరాటం మరువలేనిదన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవ్వరూ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని రేవంత్‌రెడ్డి అంటున్నారని, అయితే, దేశానికి స్వాతంత్రం ఇచ్చింది బ్రిటీష్ వాళ్లు అనకుండా గాంధీ అని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు? అలాంటపుడు తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రాణాలకు తెగించి పోరాటం చేసి, తెలంగాణ సాధించింది కేసీఆర్ కాదా అన్నారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోఉంటున్నారన్నారు. రాష్ట్రం ఇప్పటికే అనేక విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అమరుల కుటుంబాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ సహకారం అందని వారు ఉంటే వారికి సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, అలాంటి వారు ఉంటే వెంటనే నియోజకవర్గాల వారీగా జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు 21 రోజులు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విభాగాల వారీగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలు, సమస్యలపై సీఎం కేసీఆర్ సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ముందు చూపుతో ఆయా శాఖలకు ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీని కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదన్నారు. ఉద్యమ సమయంలో నష్టపోయిన వారందరికీ ప్రజాప్రతినిథులు, ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహనీయులకు మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి చీఫ్ విప్ అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అలాగే, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్లు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ రంగనాథ్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థి నాయకుడు వీరేందర్ పాల్గొన్నారు.