వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈఈఎస్ఎల్ దీపాల కాంతిలో రాయపర్తి, పర్వత గిరి మొత్తం వెలిగాయి. ప్రజలంతా చప్పట్లు కొడుతూ, సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్లతో అన్ని గ్రామ పంచాయతీలలో ఈఈఎస్ఎల్ లైట్లను పెడుతున్నామని చెప్పారు.
అందులో భాగంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం, పర్వతగిరి మండల కేంద్రాల్లో ఈ రోజు ఈ లైట్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ లైట్లతో రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తాయన్నారు. ఈ లైట్ల తక్కువ నిర్వహణ ఖర్చు చాలా తక్కువని, దీనివల్ల కరెంట్ బిల్లు చాలా వరకు ఆదా అవుతుందని చెప్పారు. తద్వారా గ్రామ పంచాయతీల పై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. గ్రామ పంచాయితీల ఆదాయంలో అధిక భాగం విద్యుత్ ఛార్జీలు ఉంటున్నాయని చెప్పిన ఆయన.. వీటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కెసిఆర్ ఈ విధమైన ఆలోచన చేశారన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత, కెసిఆర్ ముఖ్య మంత్రి అయ్యాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయని కొనియాడారు. అన్ని గ్రామాలలో ఎన్నో వసతుల కల్పన జరిగిందని, ఒకప్పుడు చెత్త నివారణ, మంచినీరు, విద్యుత్ వంటి వాటికి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. గ్రామాలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు వచ్చాయన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సరఫరా అవుతున్నదని, 24 గంటల విద్యుత్ సరఫరా అందుతోందని చెప్పారు. ఇవ్వాళ ప్రతి ఊరికి నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్త వేరు చేసే ఏర్పాట్లు, వైకుంఠ ధామాలు, కల్లాలు, రైతు వేదికలు… పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు. వంటివెన్నో వచ్చాయని వివరించారు. ‘‘పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. సీఎం ముందు చూపుతో.. ఇవ్వాళ దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి. దేశంలో అత్యుత్తమ గ్రామాలుగా ఎంపికైన గ్రామాల్లో 20కి 20 కూడా మన తెలంగాణవే. అంతేకాదు, మన ముఖ్యమంత్రి ఆలోచనలతో హరితహారం వంటి కార్యక్రమాలతో నేడు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి నెలా రూ.250 కోట్లు రూపాయలను జీపీలకు వెచ్చిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రత్యేకించి గ్రామీణ వ్యవస్థ మొత్తం బాగా పని చేయడం వల్ల కరోనా లాంటి సమస్యలను అధిగమించాం’’ అని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని, మైలారం రిజర్వాయర్, చెరువులు నిండు కుండల్లా మారాయని అన్నారు. ఎండా కాలంలో ఏ ఒక్కరికి తాగు నీటి కష్టం రాకుండా చూసుకున్న మహానుభావుడు మన కేసీఆర్ అని చెప్పారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్లనే నేడు ఒక్క మోటారు కూడా పాడు కాకుండా ఉందని, గ్రామాలు బాగు పడడం వల్ల కేంద్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నామన్నారు. ఇప్పుడు ఈ లైట్ల వల్ల కూడా గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకునే అవకాశం ఉందని, తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సీఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఏ నిధులు వచ్చినా మన జిల్లాకు మంత్రి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు వినూత్న కార్యక్రమలకు రూపాకల్పన చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే చెందుతుంది. ఇంటి ఇంటికి గోదావరి నీళ్లను ఇచ్చిన మహనీయులు మన ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమ కోసం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి కెసిఆర్ రూపొందించి అమలు పరుస్తున్నారు’’ అని కొనియాడారు.
టీఎస్ఆర్ఈడీసీవో సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రూ.300కోట్లతో ఈ వీధి లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రాయపర్తిలో 480 వీధి లైట్స్ ఏర్పాటు అయ్యాయి. ప్రతి నెలా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు గ్రామ పంచాయతీకి మిగులుతాయి. ఏ ఒక్క లైట్ పోయినా, ఆ బాధ్యత సర్పంచ్దో, వార్డు మెంబెర్దొ కాదు.. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మానిటరింగ్ సిస్టం మా కార్యాలయంలో ఉంటుంది. పోయిన బల్బులను వెంటనే రీప్లేస్ చేస్తారు. ఇప్పటి నుండి 7 సంవత్సరాల వరకు ఎక్కడ ఒక్క లైట్ పోయినా వెంటనే రెస్పాండ్ అవుతారు. మొత్తం 12, 769 గ్రామాలలో 12 నుండి 15 లక్షల వరకు వీధి లైట్లు పెట్టనున్నాం’’ అని తెలియజేశారు.
పీఆర్ కమిషనర్ హనుమంత రావు ఈ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. కరెంట్ బిల్లు ఆదా చేసే ఈఈఎస్ఎల్ లైట్లను మొట్టమొదటిగా రాయపర్తిలోనే ఏర్పాటు చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఆదా అయిన నిధులను సీసీ రోడ్ లేదా డ్రైనేజి నిర్మాణాలకు వాడుకోవచ్చన్నారు. ఈ లైట్లతో కరెంట్ బిల్ ఆదా అవుతుందని, అలాగే పర్యావరణానికి కూడా ఇవి చాలా మంచివని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.