న్యూశాయంపేట, ఫిబ్రవరి 19 : బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని తారా గార్డెన్లో ఆదివారం బంజారాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో సేవాలాల్ భవనం నిర్మిస్తున్నామని, ఈ నెల 26న పాలకుర్తిలో ఎకరం స్థలంలో రెండు కోట్ల రూపాయలతో భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేద పండితులు వస్తున్నారని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వారి జానాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆదర్శ పురుషుడు అన్నారు. సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవమని, అలాంటి మహానుభావుడు బంజారా కావడం అదృష్టమని, ఆయన సేవలు, బోధనలు ప్రపంచానికే ఆదర్శమని ఆయన అన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి మా గూడెంలో మా రాజ్యం… మా తండాలో మా పాలన కావాలనే గిరిజన, ఆదివాసీ బిడ్డల దశాబ్ద కలను సాకారం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు.
జీపీలు ఏర్పాటు చేసి రోడ్లు, విద్యుత్, తాగునీరు మౌలిక వసతులు కల్పించారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తండాలు, గూడేలు అన్నింటా బాగుపడ్డాయని మంత్రి తెలిపారు. గిరిజన ఆవాసాలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. విభజన చట్టంలోని పొందు పరిచిన గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం భూమి ఇవ్వకుండా యూనివర్సిటీ ఇచ్చిందని మంత్రి తెలిపారు.
బంజారాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, వారిలో న్యాయం, ప్రేమ, అభిమానాలు ఉంటాయన్నారు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వం, సీఎంను చూడలేదన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. త్వరలో గిరిజన బంధు పథకం కూడా రానుందని ఆయన పేర్కొన్నారు. ఇంత చేస్తున్న బీఆర్ఎస్ను కాపాడుకోడంతో పాటు సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బంజారాల కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. గిరిజనులకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తెలంగాణ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని తెలిపారు. తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.
తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిషరించేందుకు కృషి చేస్తానని, ముందుండి కొట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని, చీఫ్ విప్‌ను బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. బంజారా మహిళలు చేసిన నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్ బంజార వెల్పేర్ అధ్యక్షుడు పోరిక విన్నాయక్, ప్రధాన కార్యదర్శి ధరావత్ గిర్మోజీనాయక్, కోశాధికారి పోరిక రమేశ్‌నాయక్, కమిటీ సభ్యులు పాండ్య గంగూనాయక్, రవీందర్‌నాయక్, వెంకన్ననాయక్, ఆర్పిత్నాయక్, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.