విద్యపై సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ఉర్సుగుట్ట వద్ద ఫంక్షన్ హాల్లో మంగళవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వాసంతితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉత్తమ టీచర్లకు పురస్కారాలు ప్రదానం చేసి, శాలువాతో సన్మానించి, వారి సేవలను అభినందించారు. మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి సేవలను కొనియాడారు. రాష్ట్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడులను రూ.9వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. మౌలిక వసతులతోపాటు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.
– ఖిలావరంగల్, సెప్టెంబర్ 5
ఖిలావరంగల్, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ పీ ప్రావీణ్య, డీఈవో వాసంతితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అలాగే, ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి అనేక సేవలు అందించారన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను రూ. 9 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులతోపాటు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. పని చేసే ప్రభుత్వానికి టీచర్లు సహకరించాలని కోరారు.
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో విద్యారంగం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ కబరుస్తూ గురుకులాలు, ఉర్దూ పాఠశాలలను ఉన్నతంగా మార్చారని కొనియాడారు. నేడు ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు నీట్, ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌లో సైతం ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. దేశ భవిష్యత్ విద్య, వైద్య రంగంపై ఆధారపడి ఉందన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
గురు పూజోత్సవంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి, జానపద నృత్యాలు ఆధ్యాంతం అలరించా యి. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.