తొర్రూరు, నవంబర్ 11 : ‘పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి మరోసారి ఆశీర్వదించండి.. వచ్చిరాని హామీలతో ప్రజలను ఆగం పట్టించాలని చూస్తూ ఈ ప్రాంతంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించండి.. అభివృద్ధి పక్షాన నిలబడి ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలి..’ అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం, గుర్తూరు, ఖానాపురం, అమ్మాపురం, జీకే తండా, హచ్చుతండ, చింతలపల్లి, కొమ్మనపల్లి తండా, వెలికట్ట, భోజ్య, పెద్దమంగ్యా, టీక్యా తండాల్లో శనివారం ఆయన విసృ్తతంగా ప్రచారం చేశారు. గ్రామాల్లో రోడ్డు షోలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దయాకర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది నేనే. నియోజకవర్గంలో రోడ్లు, మురుగు నీటి కాల్వలు, అంతర్గత రోడ్లు, నిర్మించడమే గాక దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు, డివిజన్ కేంద్రం, మున్సిపాలిటీ, కాలేజీలు, వైద్యశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీళ్లు, దళితులకు దళితబంధు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అభివృద్ధిని చూసి మళ్లీ తనకే ఓటు వేయాలని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. మరోవైపు ప్రచార సందర్భంలో ఉత్సాహంగా బీ ఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, కోలాటాలతో ఎర్రబెల్లికి ఘన స్వాగతం పలికారు.
మహిళా సాధికారతను సాధించే దిశగా మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలుగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు జాబ్‌మేళా, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించినట్లు వివరించారు. కరోనా సందర్భంగా ప్రజల మధ్య ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఆనందయ్య మందు తెచ్చి ప్రజలకు ఉచితంగా అందించి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ఆయన వివరించారు.
ఇవాళ ఇకడ.. రేపు ఎకడో తెలియని వాళ్లకు ఓటు వేద్దామా.. మిమ్మల్ని నిరంతరం పట్టించుకుంటూ మీ వెంటే ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటున్న నా లాంటి వాడికి ఓటు వేస్తారా ప్రజలు తేల్చుకోవాలని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్పుకునే వారికి ఈ ప్రాంతంపై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. డబ్బులు వెదజల్లితే గెలుస్తామని గాంభీర్యాన్ని ప్రదర్శించే అలాంటి వారిని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ అభ్యర్థి ఆమెరికాకు తిరిగి వెళ్తారన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి చేస్తున్న తనను, తెలంగాణ రూపురేఖలు మార్చిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.
15 ఏళ్లుగా మీకు దయాకర్‌రావు తెలుసు, ఆయన చేసిన మంచి పనులు తెలుసు ఒక్కసారి వీటిని గుర్తు చేసుకుని కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఎర్రబెల్లి దయాకర్‌రావును గెలిపించడంతో పాటు మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు ప్రజలను కోరారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
టీ-పీసీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దగాకోరు మాటలతో తనను మోసం చేశాడని, అలాంటి వ్యక్తి టీ-పీసీసీకి ప్రెసిడెంట్‌గా ఉండి టికెట్లను అమ్ముకున్నాడని ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో తనను పని చేసుకోమని చెప్పి, ఝాన్సీరెడ్డికి టికెట్లు అమ్ముకున్నాడని విమర్శించారు. త్వరలోనే రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని, ఝాన్సీరెడ్డి తానా ఆటలు నానా ఆటలు ప్రజలకు వెల్లడిస్తానని చెప్పారు. డబ్బులతో ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్న ఝాన్సీ కుటుంబీకులు సేవ ముసుగులో ఈ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కాముకుడైన దయాకర్‌రావును మళ్లీ గెలిపించాలని తిరుపతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్లో చేరగా పార్టీ కండువాలు కప్పి మంత్రి దయాకర్‌రావు ఆహ్వానించారు. ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాలోత్ వసుందర్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఖానాపురంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరారు. కొడకండ్ల మండలం నీలిబండ తండా, చెరువు ముందు తండాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.