ఖిలావరంగల్, జూన్ 17: వరంగల్‌ను అన్ని విధాలా భ్రస్టు పట్టించి నాశనం చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఆజాంజాహి మిల్లు గ్రౌండ్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ రూపురేఖలు ఎలా మారిపోతున్నాయో ప్రజలు గమనించాని కోరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏడుసార్లు గెలిచానని, చాలామంది ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు. కానీ, కేసీఆర్ వంటి సీఎంను ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో వరంగల్ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదన్నారు.
ఆజాంజాహి మిల్లు మూతపడకుండా కాపాడాలని నాటి కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి వెళ్లిన ధర్నా చేశామని, అలాగే అసెంబ్లీ ఎదుట కూడా నిరసన చేపట్టామని గుర్తుచేశారు. ఆజాంజాహి మిల్లు కూతతో వరంగల్ నగరం నిద్ర లేచేదన్నారు. పది వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన మిల్లుకు నిధులు కేటాయించి కాపాడాలని పదేపదే విన్నవించినా కాంగ్రెస్, బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఆజాంజాహి మిల్లు మూతపడిన తర్వాత ఈ రోజు 40 వేల ఉద్యోగాలతో శాయంపేటలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే నరేందర్ తూర్పులో రూ. 600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా చేయించారని చెప్పారు. సభ విజయవంతం కావడానికి వారం రోజులుగా కృషి చేసిన నరేందర్‌ను ఎర్రబెల్లి అభినందించారు.
పసాడ్ లైట్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఓరుగల్లు కోటలో పసాడ్ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 8.70 కోట్ల నిధులతో రాతికోట ఉత్తర ద్వారం, ఏకశిలగుట్టపై ఏర్పాటు చేసిన పసాడ్ లైట్లతోపాటు రాతికోట చుట్టూ ఐదు కిలోమీటర్ల మీర ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లను స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు.