హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస్ రాజ్యాంగమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఒక నిదర్శనంగా నిలుస్తుందని మండిపడ్డారు. ప్రజల తీర్పును కాలరాసి, కాంగ్రెస్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌తోపాటు కూతురును కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి, కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరిన కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇవ్వడం.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో అదే రాజ్యాంగాన్ని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకీ తెలంగాణ ఒక ఏటీఏంలా మారిందని, అందుకే ఇక్కడి పరిణామాలు, ఇక్కడి ప్రభుత్వ అరాచకాలపై అధిష్ఠానం నోరెత్తడం లేదని మండిపడ్డారు.