హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫారంపై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడమంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి, ప్రజల తీర్పును పూర్తిగా అవమానించడమేనని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఈ తీర్పు శాసన వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ తీర్పు రాజ్యాంగ పరిహాసమే దానం, కడియంకు క్లీన్చిట్ పెద్ద తప్పిదం: బీఆర్ఎస్ నేత సుర్వి యాదయ్యగౌడ్
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు క్లీన్చిట్ ఇవ్వడం రాజ్యాంగాన్ని పరిహసించడమే అని బీఆర్ఎస్ నేత సుర్వి యాదయ్యగౌడ్ మండిపడ్డారు. ఈ నిర్ణయంతో ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నారని విమర్శించారు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన విషయం అధికారికంగా సాక్ష్యాలతో ఉన్నప్పటికీ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.