కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అథోగతి పాలైంది.. ఆ పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ సస్యశ్యామలమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు మండలం గోపాలగిరిలో మంగళవారం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి, పోలెపల్లిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనం తరం ఆయన ప్రసంగిస్తూ ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, గతంలో 33,681 ఎకరాల్లో మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 1.54లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. నాటిన నాలుగేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు రైతుకు ఏటా రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు నికర ఆదాయం వస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. అతి పెద్ద పామ్ ఆయిల్ ప్రాజెక్టును ఇక్కడ 82ఎకరాల్లో రూ.175కోట్లతో 30నుంచి 60 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 300 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
– తొర్రూరు, ఆగస్టు 29
తొర్రూరు, ఆగస్టు 29: కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీలకు అధికార యావే తప్ప ప్రజలు, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలో మంగళవారం ఆయిల్ పామ్ కర్మాగారానికి శంకుస్థాపన, కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. పోలెపల్లిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఆతర్వాత గోపాలగిరి ఆయిల్ పామ్ ప్రాజెక్టు స్థలంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగులో దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయిల్ పామ్ సాగు 33,681 ఎకరాల్లో మాత్రమే ఉండగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 1.54లక్షల ఎకరాలకు పెంచిందని తెలిపారు. 2022-23 సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 22,246 మంది రైతులు 82,372 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారని, ఈ ఏడాది (2023-24) 2లక్షల 30వేల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్ధేశించగా, ఇప్పటివరకు 43వేల ఎకరాల్లో మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. 28వేల ఎకరాల్లో మొకలు నాటినట్లు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 6,435 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని, జిల్లాలో రాబోయే పది నుంచి పదిహేనేళ్లలో 69వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉందని తెలిపారు. రెండేళ్ల క్రితం హరిపిరాలలో ఆయిల్ పామ్ నర్సరీ కోసం 45ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇక్కడి నుంచే పరిసర ప్రాంతాల రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ పంట ద్వారా ఏటా ఎకరానికి ఖర్చులు పోను రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర దాకా నికర ఆదాయం వస్తుందని, ఈ పంట దిగుబడిని పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ సంస్థ కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్క నాటిన నాలుగేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు రైతుకు స్థిరమైన ఆదాయాన్నిస్తుందని, ఈ పంటకు తకువ పెట్టుబడి, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుందని, నెలనెలా ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి, ఆయిల్ ఫెడ్ సంస్థ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుందని వివరించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ సస్యశ్యామలమైందని, సమైక్య రాష్ట్రంలో కాలువలు తవ్వి వదిలేస్తే ప్రాజెక్టులు పూర్తి చేసి, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. రైతాంగానికి ఎదురు పెట్టుబడులు ఇస్తున్నారని, రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతు బీమా అందజేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలోనే పెద్ద ప్రాజెక్టు ఇక్కడే..
దేశంలోనే అతి పెద్ద పామ్ ఆయిల్ ప్రాజెక్టును గోపాలగిరిలో 82 ఎకరాల్లో రూ.175కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందు లో 300 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనిచేస్తుందన్నారు. గంటకు 60 టన్నుల గెలలను మిల్లింగ్ చేసే ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్దదని వెల్లడించారు. దీంతో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రైతులకు ఫ్యాక్టరీ అందుబాటులో ఉంటుందని వివరించారు. పోలెపల్లిలో 33/11 కేవీ నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్సీ వర్తింపజేయడంతో హర్షం వ్య క్తం చేస్తూ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో సంబంధిత కళాకారులు ఇదే వేదికపై సీఎం కేసీఆర్ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శశాంక, ఎండీ సురేందర్, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ, ఎంపీపీలు తూర్పాటి చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీలు మంగళపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్ర య్య, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తదితరులు పా ల్గొన్నారు. తొలుత మంత్రి దయాకర్‌రావు, అధికారులకు స్థానికులు, రైతులు ఘనంగా స్వాగతం పలికారు.