హనుమకొండ జిల్లా కమలాపూర్ శివారులోని సమ్మక్క గుట్టను మింగిన ఘనులపై చర్యలు తీసుకోవడానికి మైనింగ్, రెవెన్యూ అధికారులు వెనుకాడుతున్నారు. స్థానికులు ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించింది. ఎంక్వైరీలో అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తేలినా అధికారులు మామూళ్లకు అలవాటుపడి రికవరీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– సుబేదారి, డిసెంబర్23
కమలాపూర్ శివారు ప్రాంతం సర్వే నంబర్ 720లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిలో సమ్మక్క గుట్ట ఉంది. ఇక్కడ రెండేళ్లకోసారి సమక్క-సారలమ్మ జాతర కూడా జరుగుతుంది. ఈ గుట్టపై మొరం దందా చేసే అక్రమార్కుల కన్నుపడింది. ఐదు నెలల నుంచి సెలవు దినాలు, రాత్రి సమయాల్లో జేసీబీలతో గుట్టను తవ్వి ట్రాక్టర్ల ద్వారా ట్రిప్పుకు రూ.1500 చొప్పున అక్రమ రవాణా చేసి లక్షలు దండుకున్నారు. సమ్మక్క గుట్ట అక్రమ తవ్వకాలపై జాతర కమిటీ సభ్యులు, స్థానికులు రెండు నెలల క్రితం కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్, స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేసి రవి,సమ్మయ్య అక్రమంగా 22,955 మెట్రిక్ టన్నుల మొరం తరలించినట్లు తేల్చారు. వీటిపై మెట్రిక్ టన్నుకు పదోవంతు చొప్పున రూ. 77,42, 517 జరిమానా విధించి ప్రభుత్వానికి చెల్లించాలని అక్టోబర్ 17న జిల్లా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ నుంచి వారికి నోటీసులు జారీ చేశారు.
అధికారుల మాయాజాలం..
అక్రమంగా మొరం తవ్వకాలు జరిపిన వారి నుంచి అధికారులు డబ్బులు రికవరీ చేయడా నికి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అక్రమార్కులు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల పంచ నామా రిపోర్టులో సాక్షులుగా ఉన్న వారు రెవెన్యూ అధికారులు బలవంతంగా సంతకాలు చే యించారని మైనింగ్ అధికారులకు లిఖితపూర్వంగా ఇవ్వడం అనేది పలు సందేహాలకు తావిస్తున్నది. సాక్షులపై ఒత్తిడి తీసుకొచ్చి రూ. 77,42, 517 డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమార్కులు అధికారులు, సాక్షులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి జరిమానా డబ్బులు కట్టించడంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెనుకడుగు వేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై జిల్లా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ రవి శంకర్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.