కమలాపూర్, డిసెంబర్ 12 : సివిల్ సప్లయ్ అధికారుల తప్పిదం.. రైతులకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. రైస్‌మిల్లర్ నిర్వాకంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సుమారు 500 మంది రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. నెల రోజులైనా డబ్బులు ఖాతాలో జమకాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పీఏసీఎస్‌కు 17, ఐకేపీకి 5 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా, వాటి నుంచి ధాన్యం శ్రీశైలం మల్లన్న రైస్‌మిల్లుకు తరలించారు. అయితే రైస్ మిల్లు కెపాసిటీ ఆధారంగా రిలీజింగ్ ఆర్డర్ (ఆర్వో)లు కేటాయించాలి.
కానీ సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యంతో రైస్‌మిల్లు వ్యాపారి ఆర్వో లేకున్నా కెపాసిటీకి మించి ధాన్యం దిగుమతి చేసుకున్నాడు. దీంతో ట్రక్ షీట్లు ఆన్లైన్లో నమోదు కాక ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడంలేదు. ఈ నేపథ్యంలో సదరు రైస్ మిల్లును ఇటీవల కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైస్‌మిల్లర్, సివిల్ సప్లయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రైతులకు ఎలాగైనా చెల్లింపులు చేయాలని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వరంగల్‌లోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు.
అధికారుల ఆదేశాల మేరకు ట్రక్ షీట్ల్ వారి ఫర్మ్ పేర ఆన్లైన్లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నమోదు చేశారు. ధాన్యం లేకుండా తామెందుకు ట్రక్ షీట్లు అంగీకరిస్తామంటూ రైస్ మిల్లర్లు మెలిక పెట్టారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇంత జరుగుతున్నా సదరు రైస్ మిల్లు యజమాని, సివిల్ సప్లయ్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రైస్ మిల్లు నుంచి ఇతర మిల్లులకు ధాన్యం తరలించాలంటే ఎంత ఖర్చు వస్తుంది? దీని భారం ఎవరు భరించాలి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.