వరంగల్ చౌరస్తా, ఆగస్టు 10 : ఉత్తర తెలంగాణలో పెద్ద ఆస్పత్రి, సుమారు 11 ఎకరాల విస్తీర్ణం, పదుల సంఖ్యలో భవనాలు, దాదాపు 20 రకాల విభాగాల్లో వైద్య సేవలు, నిత్యం వేల సంఖ్యలో వచ్చే రోగులు, వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లుగా చేరే వారితో ఎంజీఎం రద్దీగా ఉంటుంది. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచడానికి సానిటేషన్, రక్షణ, భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి సెక్యూరిటీ, రోగులకు సేవలందించేందుకు పేషెంట్ కేర్ సిబ్బంది నిర్వహణను ఔట్ సోర్సింగ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.
ఈ విధానాన్ని హాస్పిటల్ ప్లానింగ్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 675 మంది సిబ్బంది ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. వీరి పనితీరుపై హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో పాటు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో) స్థాయి అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తేనే సదరు సంస్థకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగుతాయి. అయితే ప్రతినెలా అధికారులు సేవలు సంతృప్తికరమంటూ సంతకాలు చేస్తుండగా బిల్లుల చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి.
ఉన్నతస్థాయి అధికారులు, హాస్పిటల్ కమిటీ చైర్మన్, కలెక్టర్, డీఎంఈ, ప్రజాప్రతినిధులు ఎంజీఎంహెచ్ని సందర్శించిన ప్రతిసారి సానిటేషన్ వ్యవస్థ, సెక్యూరిటీ, పేషెంట్‌కేర్ సిబ్బంది పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వరుస దొంగతనాలు జరిగినా, రోగుల అటెండెంట్లపై దాడులకు పాల్పడినా పట్టించుకునే వారే లేరు. పేషెంట్ కేర్ సిబ్బంది అందుబాటులో లేక అటెండెంట్లే వీల్ చైర్లు, స్ట్రెచర్లు తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు అధికారులకు కనిపించినా స్పందించడం లేదు.
పైగా ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, కలెక్టర్ సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్‌కేర్ సేవల తీరుపై ఆగ్రహంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో ఎలాంటి మార్పు రాకపోగా, వారి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయంటూ అధికారులు సంతకాలు చేయడం వెనుక మర్మం తెలియరాలేదు. ఓ వైపు స్థానిక పోలీసులు ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేసే వాహనాలకు లాక్‌లు వేసుకోవాలని, రక్షణ చర్యలు పాటించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఎంజీఎంహెచ్ అధికారులు ఔట్ సోర్సింగ్ సేవలపై దృష్టి నిలిపి నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.