వరంగల్, జూలై 13 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కోత విధిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రచారంలో విస్తృతంగా సేవలందిస్తున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఒక చోట పెంచిన జీతాల జీవోను అమలు చేస్తూ మరోచోట మొండి చేయి చూపిస్తున్నది. మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ 2023లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏడాది వరకు సవరించిన ప్రకారం జీతాలు అందజేసింది. అయితే రెండేళ్ల నుంచి అలవెన్స్‌లన్నీ తీసేసి బేసిక్ వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఇదేమి అన్యాయమని ఉన్నతాధికారులను నిలదీస్తే అదంతే అంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 378 మంది ఉద్యోగులు కోత పెట్టిన జీతాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పని చేస్తున్న మెప్మా ఉద్యోగులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లిస్తూ మిగతా పట్టణాల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎలాంటి అలవెన్స్‌లు చెల్లించకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన వేతన సవరణ జీవోను ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మెప్మాలో డీఎంసీ, టీఎంసీ, ఏడీఎంసీ, సీవో తదితర స్థాయిల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సెర్ప్ ఉద్యోగులతో పోలిస్తే మెప్మా సిబ్బంది వేతనాల్లో వేతనాలు సగం కోత పడుతున్నది. డీఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్, సీసీఏ లాంటి అలవెన్స్‌లను అందించడం లేదు. దీంతో జీవో ప్రకారం రావాల్సిన వేతనంలో సగం వరకు కోల్పోవాల్సి వస్తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకే క్యాడర్లో సెర్ప్‌లో పని చేస్తున్న ఉద్యోగికి సుమారు రూ. 70 వేల వరకు వేతనం వస్తుంటే అదే పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న వారు మాత్రం రూ. 40 వేలలోపు జీతం తీసుకుంటున్నారు. మెప్మాలో పని చేస్తున్న సీవోకు కేవలం రూ. 23 వేల లోపు వేతనం వస్తుంటే గ్రామీణ ప్రాంతంలో ఆదే క్యాడర్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 40 వేలు పొందుతున్నారు. రెండేళ్లుగా తమ వేతన వెతలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని, జీవో ప్రకారం అలవెన్స్లతో కూడిన జీతాలు చెల్లించాలని మెప్మా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.