హనుమకొండ, ఏప్రిల్ 4 : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తలతో పాటు పార్టీ నుంచి లబ్ధి పొందిన వారందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో చీఫ్ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ప్రతి డివిజన్లో పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టసుఖాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ఆత్మీయ సమ్మేళనాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలపై రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహిస్తున్నదని తెలిపారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, జోరిక రమేశ్, వీరేందర్ పాల్గొన్నారు.