ములుగురూరల్, సెప్టెంబర్ 9 : ఛాతి నొప్పి రావడంతో ఓ మహిళ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా.. జ్వరానికి సంబంధించిన చికిత్స అందించాడు. ఓవర్ డోస్‌తో మందులు ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ విషజ్వరంతో మృతి చెందినట్లు ప్రచారం జరగగా సోమవారం డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించి మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన పోలవేని లావణ్య (34) రెండు రోజుల క్రితం ఛాతినొప్పితో ములుగులోని ఆర్ఎంపీ దవాఖానను సంప్రదించింది. అక్కడి వైద్యుడు ప్రిస్క్రిప్షన్‌లో ఛాతినొప్పి అని రాసి, ఎక్స్‌రే, ఈసీజీ లాంటి పరీక్షలు చేయకుండానే గ్లూకోజులు, అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్, పారాసిటమాల్ ఇంజక్షన్లు ఇచ్చి పంపించగా లావణ్య మృతి చెందింది. ములుగులోని సదరు ఆర్ఎంపీ సంతోష్ క్లినిక్‌ను తనిఖీ చేయగా ఈ విషయం బయటకు వచ్చినట్లు డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. సదరు ఆర్ఎంపీకి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని, ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గ్రహించి అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
లావణ్య విషజ్వరంతో మృతి చెందలేదని, గుండెనొప్పిగా వైద్య బృందం నిర్ధారించిందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే వైద్యం చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెడుతున్నామన్నారు. తమ ప్రాథమిక విచారణను నివేదిక రూపంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. మృతురాలి ఇద్దరు కుమారులకు సైతం తమ బృందం పరీక్షలు చేసిందన్నారు. ఈ తనిఖీల్లో డాక్టర్లు రణధీర్, ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, మృతిరాలి భర్త రవి గతేడాది మృతి చెందగా, అప్పటి నుంచి లావణ్య కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను పోషిస్తున్నది. ఇప్పుడు ఆమె మృతితో వారు అనాథలుగా మారారు.