మార్చి 17, వరంగల్ : వేసవి కాలంలో వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Sudharani) అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడేతో కలిసి ఆమె గ్రేటర్‌లోని వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్‌తో పాటు కాజీపేట ఈఎల్ఎస్ఆర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఫిల్టర్ బెడ్ లలో మోటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన మరమ్మతులను వెంటవెంటనే చేయాలని ఆదేశించారు. వేసవికాలంలో సరిపడా నీటి నిల్వలు ఉన్న తరుణంలో అధికారులు తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని అన్నారు. తాగునీటి సరఫరా సమస్యలు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టాలని ఆదేశించారు.