వరంగల్, సెప్టెంబర్ 9 : వరంగల్ నగరాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ. 4,200 కోట్లు కేటాయించాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్లో ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా అధ్యక్షతన జరిగిన సమావేశానికి మేయర్ హాజరయ్యారు. వరంగల్ నగర చారిత్రక నేపథ్యంతో పాటు హైదరాబాద్ తర్వాత విద్య, పారిశ్రామిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై వివరించారు.
ప్రజల ఆరోగ్యం, అవసరాలకు అనుగుణంగా నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ రూపొందించామని సమావేశంలో తెలిపారు. ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున కావాలని కోరారు.
నగరంలో ప్రతిరోజు వెలువడే 450 మెట్రిక్ టన్నుల చెత్త, 4 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసం బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రూ 100 కోట్లు అవసరమని చెప్పారు. జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సిస్టం) ఏర్పాటుకు రూ.100 కోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయించాలని మేయర్ చైర్మన్కు లిఖితపూర్వకంగా విన్నవించారు. గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.