హనుమకొండ, ఏప్రిల్ 7: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కదం తొక్కారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఆర్టిజన్లు మంగళవారం ఉదయం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) పిలుపు మేరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు ఆరు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాల మొండి వైఖరి నశించాలి, అన్ని ట్రేడ్ యూనియన్లను చర్చలకు పిలవాలి’ అని నినదించారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. విద్యు త్ కార్మికుల మహాధర్నాకు వివిధ సంఘా లు, అసోసియేషన్లు సంఘీభావం తెలిపి సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ సందర్బంగా టీఆర్వీకేవీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ ఆర్టిజన్ల కన్వర్షన్‌పై ఎనిమిదేళ్లుగా కొట్లాడుతున్నామని అన్నా రు. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆర్థిక భారం పడే అవకాశం లేదన్నారు. అర్హత కలిగిన ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సర్కారు అని చెబుతున్నా విద్యుత్ శాఖలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి, యాజమాన్యానికి అనేక వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ నిబంధనలు అమలు చేయడంతో పాటు, గృహజ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులను ఆదుకోవాలని, పీస్ రేట్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా రెగ్యులర్ చేయాలని, పీస్ వర్క్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీగా మోహరించిన పోలీసులు
ఎన్పీడీసీఎల్ విద్యుత్‌భవన్ వద్ద ఆర్టిజన్ కార్మికుల మహా ధర్నా చేపట్టడడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ కార్మికులు వేలాదిగా తరలి రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతాయని చెబు తూ పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగానే మహాధర్నా చేపడుతామని కార్మి క సంఘాల నేతలు చెప్పడంతో గంట సమయం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. టీవీఏఈ జేఏసీ ఎన్పీడీసీఎల్ చైర్మ న్ సికిందర్, కన్వీనర్లు హెచ్ శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో 1104 యూనియన్ నుంచి సాయిబాబా, 1535 యూనియన్ నుంచి వజీర్, సీఐటీయూ నుంచి ఈశ్వర్, టీవీఏఈ జేఏసీ కన్వీర్, కో కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, సాయిలు, చంద్రారెడ్డి, శ్రీధర్‌గౌడ్, చందర్‌సింగ్, ప్రశాంత్, వెంకన్న పాల్గొన్నారు.