ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కస్తూరి పాడు గ్రామానికి చెందిన మాడవి అడ్మా అలియాస్ కమలేష్, పూజారి కంకేర్ గ్రామానికి చెందిన సుంకరి నారాయణ, సుంకరి సుధాకర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాడవి అడ్మా అలియాస్ కమలేష్ జననాట్య మండలి విభాగం కమాండర్‌గా, సుంకరి నారాయణ, సుంకరి సుధాకర్ మిలీషియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నట్లు ఏఎస్పీ సంకీర్త్ వివరించారు.
అడ్మా 2012లో జన నాట్యమండలి సభ్యుడిగా చేరి చర్ల-శబరి ఏరియా కమిటీ సెక్రటరీ శారద టీమ్‌లో పనిచేశారని, 2015 నుంచి జననాట్య మండలి కమాండర్‌గా కొనసాగుతున్నట్లు చెప్పారు. సుంకరి నారాయణ 2009లో మిలీషియా సభ్యుడుగా చేరాడన్నారు. మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్‌లకు సహకరించడం, పోలీసు పార్టీలను చంపేందుకు మందు పాతరలు అమర్చడం, పోలీసుల కదలికలను మావోయిస్టులకు తెలియజేస్తున్నాడని తెలిపారు. సుంకరి సుధాకర్ మూడు సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మావోయిస్టు విధానాలపై విరక్తి చెందారని, వారి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు తెలుసుకుని లొంగిపోయినట్లు ఏఎస్పీ వివరించారు. లొంగిపోయిన వీరికి ప్రోత్సాహక నగదును అందించారు. మావోయిస్టులు లొంగిపోయి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.