కాజీపేట/ఖిలా వరంగల్, సెప్టెంబర్ 1 : భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు వరద నీటితో కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి, కుదించి ఆదివారం నడిపించారు. విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన, గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, మహబూబ్‌నగర్-విశాఖపట్నం విశాఖ సూపర్‌ఫాస్ట్, కరీంనగర్- తిరుపతి కరీంనగర్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు-లింగంపల్లి గౌతమి, గూడూరు-సికింద్రాబాద్ సింహపురి, బీదర్- మచిలీపట్నం బీదర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్- శాలిమార్ ఈస్ట్‌కోస్ట్, భద్రాచలం రోడ్డు- బల్లార్షా సింగరేణి, బల్లార్షా- కాజీపేట రామగిరి, భద్రాచలం రోడ్డు- సికిందాబాద్ కాకతీయ, కాజీపేట-డోర్నకల్ ఫుష్పుల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అలాగే విశాఖపట్నం- నాందేడ్ హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్, తాంబురం-హైదరాబాద్ చార్మినార్, దానాపూర్-బెంగళూరు స్పెషల్, నిజాముద్దీన్- కన్యాకుమారి తిరుక్కురల్ స్పెషల్, ముంబాయి-భువనేశ్వర్ కోణార్క్, విశాఖపట్నం- లోకమాన్య తిలక్ టర్మినల్ ఎల్టీటీ, విశాఖపట్నం- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను విజయవాడ, గుంటూరు, నల్లగొండ, పంగిడిపల్లి రైల్వే స్టేషన్ల్ మీదుగా దారి మళ్లించి నడిపించారు. తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి, విజయవాడ మధ్య నడిపించారు. సిర్పూర్ కాగజ్‌నగర్- భద్రాచలం రోడ్డు సింగరేణి రైలును కాజీపేట వరకు కుదించారు. కాగా, రైళ్ల రాకపోకలు సమాచారం తెలిపేందుకు కాజీపేట రైల్వే స్టేషన్లో హెల్ప్‌లైన్ డెస్కును ఏర్పాటు చేశారు.